- చైనా ఫారిన్ మినిస్టర్‌తో వాంగ్‌యీతో సమావేశం
బీజింగ్: అమెరికాతో ఘర్షణలను పొడిగించేందుకు తమ దేశం ఆసక్తిగా లేదని, దౌత్యపరమైన పరిష్కారం వైపు అడుగులు వేయాలని చూస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. యెమెన్‌కు చెందిన హౌతీలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో అరాఘ్చీ బీజింగ్‌లో పర్యటించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమై పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై చర్చలు జరిపారు. వాంగ్ యీ మాట్లాడుతూ ఈ ఘర్షణలను ముగించేందుకు ఇరాన్, అమెరికా దేశాలు ఇస్లామాబాద్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించారు.
ఘర్షణలు ఇలాగే పొడిగించడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని, త్వరలోనే ఆ ఒప్పందానికి తిరిగి వచ్చి చర్చల పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు. హార్మూజ్ జలసంధిని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని వాంగ్ యీ విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్రిక్తతలు యెమెన్, ఎర్రసముద్రానికి కూడా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒమన్‌తో ఒప్పందం కుదిరింది
పశ్చిమాసియా పరిణామాలను వాంగ్ యీకి వివరించిన అరాఘ్చీ.. తాము ఘర్షణలను కోరుకోవడం లేదని, తమ చట్టబద్ధమైన హక్కులను కాపాడుకుంటూనే దౌత్య మార్గాలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందం ఇంకా అమల్లో ఉందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. హార్మూజ్ జలసంధి పునరుద్ధరణకు సంబంధించి ఒమన్‌తో ఒప్పందం కుదిరిందని, వాషింగ్టన్ కూడా తన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా, యెమెన్‌కు చెందిన హౌతీలు ఇటీవల సౌదీ అరేబియాపై దాడులను ఉధృతం చేయడంతో పాటు, బాబ్ ఎల్- మాండెబ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను అడ్డుకుంటున్నారు. ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో నౌకలు, చమురు ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇంధన సంక్షోభం ఏర్పడిన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి
